- ఆంధ్రాశ్రమం 58 వ పుట్టినరోజు
- కాశి వాశి భవన గ్రుహప్రవేశ ఆహ్వానపత్రిక
- 11-04-13 ఉగాది నాడు ప్రారంభించిన ఆధునిక వంటశాల చిత్రమాలిక
- 2024 Ganga Pushkaralu
- Kasi Kailas Bhavan
- Nitya Annadaanam
- 2024 Maha Sivaratri
- 2024 Ugadi
- 2024 Sri Ramanavami
- Sri Sri Sri Senkara Vijayendra Sarswati Maha Swamy vari visit to Andhra Asramam
- 2024 Vinayaka Chaviti
ఆశ్రమ వ్యవస్థాపకలు శ్రీశ్రీశ్రీ రామభద్రేంధ్ర సరస్వతి స్వామి వారితో అప్పటి యు,పి గవర్నర్ బూరుగుల రామకృష్ణా రావు గారు, శ్రీచల్లా లక్ష్మణ శాస్త్రి గారు
Sri B.Gopal Reddy ex Governor with founder Sri Sri Sri Rama Bhadrendra Saraswathi Swamy varu in Ashramam
ఆశ్రమ శంఖుస్థాపన సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ వి.వి.గిరి గారి సమక్షంలో ప్రసంగిస్తున్న ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ రామభద్రేంద్ర సరస్వతీ స్వామి వారు
Dr.K.L.Rao, ex-Central Minister with founder Sri Ramabhadrendra Swaraswathi Swamiji and with V.S.R.Murthy, ex-Managing Trustee at Ashramam visiting the Ashramam
స్వర్నోత్సవ చిత్రమాలిక
స్వర్ణోత్సవ సందర్భంగా స్వర్ణోత్సవ దీపిక ప్రజ్వలన చేస్తున్న మాజీ గవర్నర్ శ్రీ వి.రామారావు గారు,ఆశ్రమ మేనిజింగ్- ట్రస్టీ శ్రీ వి.వి.సుందర శాస్త్రి, అడిషనల్ మేనిజింగ్ ట్రస్టీ శ్రీయమ్.సీతారామయ్య గారు సంపూర్ణానందసంస్కృత విశ్వవిద్యాలయ కులపతి శ్రీ వెంపటి కుటుంబ- శాస్త్రి గారు, వారణాశి M.L.A, శ్రీ శ్యామ్ దేవ్ -రాయ్ చౌదరి గారు
స్వర్ణోత్సవ సందర్భంగా స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ చేస్తున్న మాజీ గవర్నర్ శ్రీ వి.రామారావు గారు,
ఆశ్రమ మేనిజింగ్ ట్రస్టీ శ్రీ వి.వి.సుందర శాస్త్రి, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి శ్రీ వెంపటి కుటుంబ- శాస్త్రి గారు, వారణాశి M.L.A, శ్రీ శ్యామ్ దేవ్ రాయ్ చౌదరి గారు
శ్రీ రామ తారక ఆంధ్రా ఆశ్రమం, వారణాశి
స్వర్ణోత్సవ వేడుకల సమాచారము
అక్టోబరు 20 – 22, 2010
వారణాసి (కాశీ) లో ఆంధ్ర యాత్రికులకు అన్ని వసతులను సమకూరుస్తున్న శ్రీ రామ తారక ఆంధ్రాశ్రమం స్వర్ణోత్సవములు ది. 20.10.2010 నుండి 22.10.2010 వరకు వైభవముగా జరిగినాయి.
22.10.2010 ఉదయం శ్రీ వేణుగోపాల్ అండ్ పార్టీ వారి నాదస్వరముతో ప్రారంభమయ్యి, ఆశ్రమములో వెలసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత మానసేశ్వర స్వామివారి మందిరములోను, శ్రీ రామమందిరము, ఇతర మందిరములలోను పూజాకార్య క్రమములు యధావిధిగా జరుపబడినవి. శ్రీ విష్ణుభక్త బృందము, హైదరాబాదు వారు విష్ణు సహస్రనామ పారాయణ, భజనలు నిర్వహించినారు. సాయింత్రము 4.00 గం.లకు స్వర్ణోత్సవ ప్రారంభోత్సవములు ఆశ్రమ ట్రస్టీలు, శ్రేయోభిలాషులు, పురప్రముఖుల సమక్షంలో మొదలయినవి. ఈ సభకు సిక్కిం మాజీ గవర్నరు శ్రీ వి. రామారావుగారు, వారణాసి (దక్షిణ్) నియోజక వర్గ ఎమ్.ఎల్.ఏ. శ్రీ శ్యామ్ దేవ్ రాయ్‌చౌదరి గారు, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి గారు, ముఖ్య అతిథులుగా శ్రీ వేమూరి వెంకట సుందర శాస్త్రి, మేనేజింగ్ ట్రస్టీ అధ్యక్షతన ప్రారంభించి జ్యోతిని వెలిగించారు.
అడిషనల్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ముక్తేవి సీతారామయ్య గారు, ముందుగా అతిధులకు స్వాగతం పలుకుతూ ఆశ్రమ స్థాపన నుండి శ్రీ స్వాములవారితో సన్నిహితముగా వుండి మొదట్లో ఆశ్రమ ట్రస్టీగా వుండి ఈ 45 సం. లలో ట్రస్ట్ బోర్డు ఛైర్మనుగా వుంటున్న శ్రీ జి.యస్. రాజు గారి (సిరీస్ రాజు గా ప్రశస్తి పొందిన) గూర్చి ప్రసంగిస్తూ వారు కాశీ లోని కాశీ హిందూ విశ్వవిద్యాలయములో పట్ట భద్రులై, అమెరికాలో ఉన్నత విద్యను సాగించి తిరిగి మన దేశములోనే స్థిరపడి దేశ సేవకు, పారిశ్రామికాభి వృద్ధికి తోడ్పడుతున్న వైనము, వారి దక్షత, గంభీరత్వము, వ్యవహారిశైలిని గురించి ప్రశంసించారు. చివరి నిముషములో ప్రయాణము విరమించినా తాను దగ్గర ఉన్నట్లుగా భావించి స్వర్ణోత్సవ వేడుకలను జయప్రదముగా సాగించవలెనని శుభాశీస్సులు పంపారని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమములు, ఇకముందు తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమముల గురించి తెలిపారు. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రామ భద్రేంద్ర సరస్వతి స్వామి వారు కాశీని దర్శించే ఆంధ్ర యాత్రికులకు సకల సదుపాయాలను కలుగ చేయాలనే ధృఢ సంకల్పముతో ఎన్నో ప్రయాసలకోర్చి ఈ ఆశ్రమాన్ని నిర్మింప చేశారని, వారి పూర్వాశ్రమ పుత్రులు శ్రీ వేమూరి రామచంద్రమూర్తిగారు మేనేజింగ్ ట్రస్టీగా దానిని ఇంకా అభివృద్ధి చేసి రెండవ అంతస్తును, అన్నదాన కార్యక్రమాలను, అలాగే ఆశ్రమానికి వచ్చే వృద్ధులు ఇబ్బంది పడకుండా లిఫ్టు సౌకర్యాన్ని కలుగచేసారని, తదనంతరం వారి పుత్రులు శ్రీ వేమూరి వేంకట సుందరశాస్త్రీ, తనూ ఆశ్రమాన్ని కుశలతతో నడుపుతూ దానిని ఇంకా అభివృద్ధి పరచడానికి శ్రమిస్తున్నారని తెలిపారు. ఆశ్రమములో వసతికి 110 గదులున్ననూ, ప్రతి ఏటా పెరుగుచున్న యాత్రికుల రద్దీకి పూర్తి న్యాయము చేయలేకపోవుచున్నామని, ఇంకా అభివృద్ధి కొరకు సమీపంలో బిల్డింగుకాని, భూమిగాని సంపాదించుటకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
శ్రీ శ్యామ్ దేవ్ రాయ్‌చౌదరి మాట్లాడుతూ ఆంధ్రాశ్రమము ఆంధ్రదేశము నుండి వచ్చే యాత్రికులకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఆశ్రమము కొరకు తన వంతు సహాయాన్ని అందచేస్తానని హామీ ఇచ్చినారు.
ఆచార్య కుటుంబ శాస్త్రి గారు శ్రీ శ్రీ శ్రీ రామభద్రేంద్ర స్వామివారి కృషిని కొనియాడి, భారతదేశములో ప్రతి ఒక్కరూ కూడా కనీసం తమ జీవిత కాలంలో ఒకసారయినా కాశీని, అన్నపూర్ణా విశ్వేశ్వరులను దర్శించుకొని, పవిత్ర గంగానదిలో స్నానమాచరించి తమ పితృదేవతలకు శ్రాద్ధకర్మలను నిర్వర్తించి తమ జన్మను సార్ధకం చేసుకుంటారని తెలుపుతూ యాత్రికులు ఏ ప్రదేశానికి వెళ్లినా ముందుగా వసతి, తరువాత తమ అనుష్ఠానముల కొరకు, తరువాత భోజన వసతిని చూసుకుంటారని, ఆంధ్రాశ్రమం వీటన్నిటిని ఒక్కచోటనే సమకూరుస్తూ ఆంధ్ర యాత్రికులకుఎంతో సేవ చేస్తున్నదని కొనియాడారు. భారత దేశంలోని అన్ని తీర్థములకన్న కాశీకి ఎక్కువ ప్రశస్థి అని, అలాగే ఎక్కువ మంది యాత్రికులు కాశీకి వస్తారని అన్నారు. ఆంధ్రాశ్రమము నిర్మిత మయిన మానసరోవరకుండ ప్రశస్థిని తెలుపుతూ కాశీ లో ఎన్నో కుండములు ఉన్నాయని, వాటన్నిటిలోను మానసరోవరము తలమానికము వంటిదని, ఇది హిమాలయములలో ఉన్న మానసరోవరమునకు ప్రతీక అని తెలిపారు.
గౌ. శ్రీ రామారావుగారు, (పూర్వ సిక్కిం గవర్నరు) స్వర్ణోత్సవ సంచికను ఆవిష్కరించారు. స్వర్ణోత్సవ సంచికను గురించి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సుందర శాస్త్రి మాట్లాడుతూ, ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రామభద్రేంద్ర సరస్వతి స్వాముల వారి సమయంలో ఆశ్రమము 10 సం. లు పూర్తి చేసుకున్న సందర్భములో ఒక సంచికను వెలువరించారని, ఆ తరువాత ఈ 40 సం. లు అయిన తరువాత ఈ స్వర్ణోత్సవ సంచికను వెలువరించామని, ఇందులో పుష్పగిరి పీఠాధిపతులు, కుర్తాళం పీఠాధిపతులు, విశాఖ శారదా పీఠాధిపతులు, సద్గురు శ్రీ శివానందమూర్తి గార్ల సందేశ ఆశీస్సులుపొందుపరచబడినవని తెలిపారు. ఇంకను ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగారైన ఆ.ఏ.థ. నరసింహన్ గారు, మధ్య ప్రదేశ్ గవర్నరు రామేశ్వర్ ఠాకూరు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ రోశయ్యగారు, వారణాసి లోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రిగారు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జి శ్రీ నూతి రామమోహనరావుగారు, ఇంకా ఎంతో మంది ప్రముఖుల, శ్రేయోభిలాషుల సందేశాలు పొందుపరచబడినవి. ఆశ్రమము ప్రారంభమునుండి, అభివృద్ధి జరుగునప్పుడు జరిగిన సన్నివేశాలు ఛాయాచిత్రముల రూపముగా పొందుపరచబడినవి.
ఈ సంచికలో ఆశ్రమ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ శ్రీ రామ భద్రేంద్ర సరస్వతి స్వాముల చరిత్ర, కాశీ క్షేత్ర మహాత్మ్యము, శ్రీ రామతారక ఆంధ్రాశ్రమము యొక్క ప్రారంభ, అభివృద్ధి దశలలోని చరిత్ర, భక్తిని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఒసగే వ్యాసములు, అష్టకములు, స్తోత్రములు కలిగి దీర్ఘకాలము భద్రముగా ఉంచుకోవలసిన గ్రంథముగా తయారైనది. చాలామంది ప్రోత్సాహకులు తమ వాణిజ్య వస్తువులనుటంకిస్తూ, స్వర్ణోత్సవ సమయ సందర్భముగా తమ శుభాకాంఙలను తెలియజేస్తూ ప్రకటనలను ఇవ్వడం జరిగినది.
ఈ సంచికను అందముగా రూపొందించుటకొరకు ఎడిటోరియల్ బోర్డువారు దీక్షతో కృషిచేశారు. ముఖ్యముగా వీజయవాడలో ఉన్న విశ్రాంత టెలిఫోన్ ఇంజనీరు శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారి మరియు విశ్రాంత ఆంధ్ర బ్యాంకు మేనేజర్ శ్రీ కె. రామామోహన రావుగారి కృషి పేర్కొనదగినది. అట్లే ఈ సంచికను అందముగా, క్రమబద్ధముగా ముద్రించి ఇచ్చిన విజయవాడ …. ప్రెస్ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపినారు.
సంచికను ఆవిష్కరించిన తరువాత, గౌ. శ్రీ వి. రామారావుగారు మాట్లాడుతూ, శ్రీ శ్యామ్ దేవ్ రాయ్‌చౌదరిని ఆశ్రమం చుట్టుపక్కల, ఆశ్రమము నుండి గంగకు మరియూ మందిరానికి వెళ్లే మార్గాలలో విద్యుద్దీపాలను ఏర్పాటుచేయవలసిన అవసరము ఎంతయినా ఉందని తెలిపారు. అలాగే గల్లీల పరిశుభ్రతకు మేయరుతోకాని మరి ఏఇతర అధికారులతో కాని మాట్లాడి పరిశుభ్రతను మెరుగు పరచవలసిన అవసరం ఉందని తెలిపారు. ఒకొక్కసారి పండాల ప్రవర్తన సరిగా ఉండటల్లేదని తనకు జరిగిన అనుభవాన్ని తెలిపారు.
ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సుందర శాస్త్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు శ్రీ జి. యస్. రాజు (సిరీస్ రాజు) గారు రావలసి ఉండగా ఆఖరి నిమిషాల్లో వారి ఆరోగ్యం బాగుండక రాలేక పోయారని, ఆశ్రమ నిర్వహణలో సూచలనిస్తూ తమని ప్రోత్సహిస్తున్న ట్రస్టు బోర్డు సభ్యులకు తమ కృతజ్ఞతలు తెలియ జేసారు.
శ్రీ రాధా కృష్ణ మూర్తి గారు (ట్రస్టీ), ధన్యవాదాలను తెలియ చేసారు.
కాశీ క్షేత్రములోని రామతారక ఆంధ్ర ఆశ్రమములో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భములో, కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు తమ అనుగ్రహ భాషణములో కాశీ క్షేత్రవైశిష్ట్యమును గురించి, ఈ క్షేత్రముతో వారికి గల జన్మ జన్మాంతర అనుబంధముగురించి విపులముగా ప్రసంగించినారు. భక్తులు కానివారు, ఈశ్వరుని పట్ల అపరాధములు గావించినవారు శ్రీ కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవునిచే ఏ విధముగా ఇబ్బందులకు గురవుతారో వివరించారు. ధార్మిక దృష్టితో భక్త జనులు చేయుతపస్సులకు, హోమ యజ్ఞములకు ఉండే సత్ఫలితాలను సోదాహరణముగా తెలియజేసారు. గంటసేపు వారు గావించిన ప్రసంగము భక్త జనావళిని ఆకట్టుకొన్నది.
ఆ తరువాత కంచి పీఠ ఆస్థానవిద్వాంసులు, ఆలిండియా రేడియో కళాకారులు శ్రీ మోదుమూడి సుధాకర్ గారు తమ గాత్ర కచేరితో మధుర సంగీత కార్యక్రమము నిర్వహించారు. శ్రోతలు ముగ్దులై త్యాగరాజ, అన్నమాచార్య కీర్తనలు ఆస్వాదించారు. ఆంధ్రాశ్రమ స్వర్ణోత్సవాల సందర్భంగా కళ్యాణ రాగం లో ప్రత్యేకం గా రాగం తానం పల్లవి ని ఆలపించారు. శ్రీ నీలాద్రి గారు వాయొలిన్, శ్రీ యమ్. రవిగారు మృదంగం, శ్రీ ఏడుకొండలు గారు తబలా సహకారాన్ని అందించారు.
ఆపై కూచిపూడి కళాకేంద్రము, అనంతపురం వారి నృత్య కార్యక్రమము కొనసాగింది. సుశిక్షుతులైన బాలికలు నృత్యముతో ప్రేక్షకులనలరించారు.
2వ రోజు జరిగిన కార్యక్రమాలు
21.10.2010 ఉదయం సుప్రభాత సేవ శ్రీ వేణుగోపాల్ అండ్ పార్టీ, హైదరాబాదు వారి నాదస్వరముతో ప్రారంభమయి, ఆశ్రమములో వెలసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత మానసేస్వర మందిరములోను, శ్రీరామాలయము, ఇతర ఆలయములలోను పూజాకార్యక్రమములు యధావిధిగా జరుపబడినవి. శ్రీ విష్ణు భక్త బృందము, హైదరాబదు వారు విష్ణు సహస్రనామ పారాయణ, భజనలు నిర్వహించారు. ఆ తరువాత 101 మంది యతులకు (దండి సన్యాసులకు) యతి బిక్ష శ్రద్ధాసక్తులతో ఆశ్రమ బృందము, మేనేజింగు ట్రస్టీ శ్రీ సుందర శాస్త్ర ఆధ్వర్యములో నిర్వహింపబడినది. ఈ కార్యక్రమములో అడిషనల్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సీతారామయ్య, ట్రస్టీలు శ్రీ కె.యల్.యస్.యన్. శర్మ, శ్రీ డి. రాధాకృష్ణమూర్తి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమంతయు జగద్గురువులు కుర్తాళ పీఠాధిపతి మరియు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతుల సమక్షములో శాస్త్రోక్తముగా నిర్వహింపబడినది. సాధారణముగా ఒక్క యతికి బిక్ష ఎర్పరిచితే విశేషమైన పుణ్యఫలము ఉంటుంది. అటువంటిది పవిత్ర కాశీ క్షేత్రములో సామూహిక యతి బృందమునకు వారికి పూర్తి సంతృప్తి కలిగే విధముగా బిక్షను జరిపించుట కొన్ని కోట్ల రెట్ల శుభాన్ని ప్రసాదింపగలదు.
సాయంకాలము నిష్ణాతులైన షుమారు 60 మంది వేదపండితులతో చాతుర్వేద పారాయణం ఘనముగా, వీనుల విందుగా శ్రీ కుర్తాళం పీఠాధిపతుల సమక్షములో జరిగినది. వేదపండితులను ఉచిత రీతిని సన్మానించుట జరిగినది. ఈ కార్యక్రమమునకు సిక్కిం పూర్వ గవర్నరు శ్రీ వి. రామారావుగారు, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
శ్రీ తులసి రమాకాంత్ జోషి ఉభయ భాషలలోను కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. సాయింత్రం 6.00 గం. కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ గురువు యొక్క విశిష్ఠతను తెలియ జేసారు. గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లకన్న పరమ పూజ్యనీయుడనియు, గురువే మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడని తెలియ జేసారు. ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి గారు మాట్లాడుతూ పది – ఇరవై – ముఫ్ఫై సంవత్సరాల క్రితం వారణాశి ఎలాఉండేదో చెపుతూ ప్రస్తుతం వారణాశి చాలా ప్రశాంతంగా ఉందని అన్నారు. ఇక్కడకు వచ్చిన యాత్రీకులు ఇరుకు గానూ, అపరిశుభ్రంగా ఉన్న గల్లీలను, గంగను చూసి అసహ్యించు కుంటూ ఉంటారంటూ ఇవన్నీ కూడా విశ్వనాధుడు మరియు కాలభైరవుడు ఇక్కడకు వచ్చే భక్తులకు పెట్టే పరీక్షలనియు, వీటన్నిటిని అధిగమించి నిలచినవానికే కాశీలో ముక్తి దొరుకుతుందని తెలియ జేసారు. అనంతరం వారణాశి ఆకాశవాణి లో ఆస్థాన విద్వాంసునిగా పనిచేస్తున్న శ్రీ ఆర్. కే. శ్రీనివాస్ గారి వేణు గాన కచేరి జరిగింది. శ్రీ చూడామణి గారు మృదంగంపై సహకరించారు.
రాత్రి 9.00 గం. కు విజయవాడ శ్రీ విజయకృష్ణా నాట్యమండలి వారిచే శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణగారి ఆధ్వర్యములో శ్రీకృష్ణ రాయబారం రంగస్థల నాటకం ప్రదర్శింప బడినది. నాటక ప్రదర్శనను ఆశ్రమంలో ఉన్న భక్తబృందమే కాక వారణాశిలో నివసిస్తున్న తెలుగువారు కూడా తిలకించి ఆనందించారు.
3వ రోజు జరిగిన కార్యక్రమములు:
మూడవ రోజు (22-10-2010) ప్రాతఃకాలము నుండి ఆశ్రమములో నిత్య పూజలు, అభిషేకములు, విష్ణు సహస్రనామ పారాయణము యధావిధిగా జరిగినవి. ఉదయము జరిగిన సభాకార్యక్రమములో ఢిల్లీలో ఉన్న ఆంధ్రా బ్యాంకు జనరల్ మానేజరు శ్రీ పి. శ్రీనివాస్ గారు ముఖ్య అతిధి గాను, ఆశ్రమ అడిషనల్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ముక్తేవి సీతారామయ్యగారు అధ్యక్షతవహించిరి. శ్రీ ముక్తేవి సీతారామయ్యగారు తమ అధ్యక్ష స్వాగతోపన్యాసములో ముఖ్య అతిథి శ్రీనివాస్ గారిని పరిచయము చేస్తూ వారి ఇంజనీరింగు ప్రతిభను, బ్యాంకులలో వివిధ రంగాలలో వారుచూపిన పరిపాలనా దక్షతను ఉటంకిస్తూ, ఆంధ్రా బ్యాంకుతో ఆంధ్రాశ్రమమునకు ఉన్న అనుబంధమును, బ్యాంకు స్థాపకులైన డా. పట్టాభి సీతారామయ్యగారు, ఆంధ్రాశ్రమ స్థాపనలో అప్పటి ఉత్తర ప్రదేశ్ గవర్నరుగారైన శ్రీ వి.వి. గిరిగారితో సమీకరించి, ఆశ్రమ స్థాపకులైన శ్రీ శ్రీ శ్రీ రామభద్రేంద్ర సరస్వతి వారికి సహకరించి, ట్రస్టు బోర్డు స్థాపనకు ట్రస్టు డీడు వ్రాయించి ఇచ్చిన సంగతి, ఇప్పటి ఆంధ్రా బ్యాంకుతో ఆశ్రమమునకు ఉన్న ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్లు విషయమై అన్యోన్యసహకారము, బ్యాంకు వారు యాత్రికుల సౌకర్యార్ధము బహూకరించిన కూలర్లు, సావనీరుకు ఇచ్చిన సహకారము గురించి తెలిపారు.
ముఖ్య అతిథి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమములో పాల్గొనుచున్నందులకు సంతోషము గలుగుచున్నదని, ఆశ్రమమునకు, ఖాతాదార్లకు ఇంకను విశిష్టమైన సేవలను అందించుటకు ప్రయత్నము చేయగలమని అన్నారు.
ఆంధ్ర ఆశ్రమము స్థాపనలోను, సంశ్థ అభివృద్ధిలోను పాల్గొన్న, పాల్గొనుచున్న దాతలకు, ప్రముఖ వ్యక్తులకు సన్మానము జరిగినది. కాశీలో నివాసము ఉంటూ, క్షేత్రమును దర్శించు యాత్రికులకు సేవచేయు పురోహిత ప్రముఖులు, ఆశ్రమ వ్యవస్థాపికులైన ప. పూ. శ్రీ రామభద్రేంద్ర సరస్వతి స్వాములవారికి సహాయము చేసిన ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు సన్మానింపబడ్డారు.
సాంయకాలం సభకు పూర్వ సిక్కిం గవర్నరు శ్రీ వి. రామారావుగారు అధ్యక్షులుగాను, వారణాసి అర్బన్ డెవలెప్ మెంటు అధారిటీ వైస్ ఛైర్మన్ శ్రీ ఆర్.సి. గోస్వామి గారు ముఖ్య అతిథిగాను, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయము కులపతి ఆచార్య వి. కుటుంబ శాస్త్రిగారు విశిష్ట అతిథిగాను సభ జరిగినది. ఇందులో పత్రికా ప్రతినిధులకు, ఆశ్రమ ట్రస్టీలకు, ఆశ్రమములో పనిచేయుచున్న సభ్యులకు సన్మానము జరిగినది. శ్రీ కుటుంబ శాస్త్రిగారు మాట్లాడుతూ కాశీ క్షేత్రమహిమను ప్రశంసిస్తూ, ధార్మిక చింతన గురించి చెప్పి, కాశీ క్షేత్ర పురాతన విశిష్టతను కాపాడుటకు ప్రయత్నము చేయవలసినదిగా శ్రీ గోస్వామి గారిని కోరారు. సాధారణముగా ట్రస్టు లన్నియు ఏదోఒక మంచి ఉద్దేశ్యముగా ప్రారంభమవుతాయని కాని కాలక్రమేణా జరుగు మార్పులవలన ఎక్కువభాగం ట్రస్టులువాటి ప్రాధమిక ధర్మాన్ని విడిచిపెట్టి, నిరుపయోగమో, దురుపయోగమో అవుతున్నాయని, కాని ఈ శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమ ట్రస్టు శ్రీ స్వామివారి సంకల్ప బలమువలన, ట్రస్టు బోర్డు వారి సహకారమువలన, వారణాశిలోని పాలక బృంద దీక్షా దక్షతలవలన దినదినాభివృద్ధి చెందుతూ యశస్సును గడిస్తున్నదని అన్నారు.
శ్రీ గోస్వామిగారు తమ ప్రసంగములో అర్బన్ యాక్టులోగల లోటుపాటులను ఉటంకిస్తూ తమ వంతు కృషికి పాటుపడుతామన్నారు.
శ్రీ రామారావుగారు మాట్లాడుతూ గంగాఘాట్ ల వెంబడి లైటింగు, పారిశుధ్యమును ఇంకా బాగుచేయాలని శ్రీ గోస్వామిని కోరారు. ఆశ్రమములవంటి ధార్మిక సంస్థల యజమానుల సమావేశము ఏర్పరిచి వాటి అభివృద్ధికి నగరపాలకుల సహాయము కోరారు.
శ్రీ సుందర శాస్త్రి, మేనేజింగ్ ట్రస్టీ ఆశ్రమ చరిత్రను వివరిస్తూ ఆంధ్ర ప్రాంతము నుండి కాశీకి వచ్చు భక్త యాత్రికులకు కొత్త ప్రదేశములో బస చేయు ప్రదేశమును గురించి ఆలోచిస్తే మొదటగా “ఆంధ్ర ఆశ్రమము” గురించి ప్రయత్నిస్తారని, ఈ ఏబది సంవత్సరములలో ప్రయాణ సౌకర్యములు, భక్తి భావము పెరుగుచున్నందువలన యాత్రికుల రద్దీ అనూహ్యముగా పెరుగుచున్నదని, ఆశ్రమములో 110 గదులుండి, రోజుకి షుమారు 800 మంది యాత్రికులకు వసతి కల్పించగల అవకాశము ఉన్నను, కాశీలో కనీసము 9 రోజులైనా ఉండాలని, ఎన్ని ఎక్కువరోజులు వీలైతే అన్ని నాళ్లు ఉండాలనే యాత్రికుల కోరికతో, అడిగిన అందరికి వసతి సౌకర్యము కలిపించుట ఇబ్బంది కరముగా ఉన్నదని తెలిపారు. అయినను ఒకసారి ఆశ్రమములో వసతి లభించిన వారిక అన్ని రకములైన వసతి ఏర్పాట్లు, యాజమాన్యము వారు చేయుచున్నందు వలన “ఇంటి కంటె గుడి పదిలము” అన్న సామేత ప్రకారము యాత్రికులు, తమ తీర్థ విధులు పుణ్య కార్యములు నిరాటంకముగా, నిత్య సంతృప్తికి జరుపు కుంటున్నారని, తీర్థవిధులు సమీపములోని గంగా ఘాటుల్లోను, పురోహితులవద్ద జరుపుకుంటూ శ్రీ విశ్వనాథులవారికి అభిషేకమునకు ఏర్పాటు, లక్షవత్తుల నోములు, యాగములు, హోమములు, పారాయణలు, భజనలు చేసుకొను ఏర్పాట్లు యాజమాన్యము వారు చేయుచున్నారని తెలిపారు.
షడ్రషోపేతమయిన శ్రీ కాశీ కుసుమాంబ నిత్యాన్న దాన పధకము, సాయింత్రము ఉపాహారము ఏర్పాటు, కాశీలోని ముఖ్య ప్రదేశములను దర్శించే ఏర్పాటు, కాఫీ సౌకర్యము, వైద్య సౌకర్యము మున్నగు సమస్త అవసరములకు ఆశ్రమ యాజమాన్యము కలిగించుచున్నదని తెలిపారు.
ఒక చిన్న ఉదాహరణగా, కొద్ది కాలము క్రిందట షుమారు 20 మంది యాత్రికుల బృందము కాశీవచ్చి, ఆశ్రమములో వసతిగా ఉంటూ అయోధ్య, ప్రయాగ, గయ మున్నగు క్షేత్రములను దర్శించి అక్కడి పుణ్య కార్య క్రమములన్నిటిని నిర్వర్తించుకొనుచూ గయనుండి వస్తూ ఉండగా బృందం లోని ఒక పుణ్య స్త్రీకి దోవలో అలసట అనిపించి, కాశీ వచ్చేసరికి రాత్రి 11.00 గం. లకు అనారోగ్యము ఎక్కువై, ఆసుపత్రికి వెళుతూ రాత్రి 12.00 గం. ల సమయములో అనాయాసముగా శివసాయుజ్యము చెందినదని, ఆసుపత్రికి తీసుకొని వెళ్లటానికి, అర్ధరాత్రి శరీరాన్ని కాపాడటానికి, తెల్లవారకముందే పవిత్ర గంగా తీరములో హరిశ్చంద్ర ఘాట్ లో అంతిమ సంస్కారానికి ఆశ్రమ యజమాన్యము, సిబ్బంది తోడ్పడి, నూతన ప్రదేశములో అయోమయములో ఉన్న యాత్రిక బృందానికి ఏ విధమయిన ఇబ్బంది కలుగ కుండ చేసినామని, దానికి వారు చాలా కృతజ్ఞతా భావాన్ని వెల్లడించారని తెలిపారు.
ఆశ్రమములో వసతి కల్పించి నప్పటినుండి, వారు కాశీనుండి తిరుగు ప్రయాణము చేసేవరకు యాత్రికులకు తమ కుటుంబ సభ్యులవలె వ్యవహరించుచూ, ఆశ్రమ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ శ్రీ రామభద్రేంద్ర సరస్వతి స్వామివారి ఆశయమును నెరవేరుస్తూ ఆశ్రమ యాజమాన్యము, సిబ్బంది అన్ని విధముల తోడ్పడుతున్నారని తెలియజేసారు.
సాయింత్రం 6.00 గం. కు శ్రీ ద్వారకా జ్యోతిర్మఠ పీఠాధి పతుల శిష్యులు శ్రీ శ్రీ శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతీ స్వామివారు అనుగ్రహ భాషణమిస్తూ శివ కేశవుల అభేద భావాన్ని విశదీకరించారు మరియు కాశీ క్షేత్ర మహిమను, పవిత్ర గంగానది పరిరక్షణావశ్యకతను వక్కాణించారు. శ్రీ స్వామీజీ ప్రసంగమును హిందీ ప్రవేశము లేకపోయిననూ శ్రోతలు సంపూర్ణ శ్రద్ధతో ఆలకించారు. తరువాత శ్రీ వేణుగోపాల్ అండు బృందము వారిచే నాదస్వర కచేరీ శ్రోతలను అకట్టుకున్నది. శ్రీ వేమూరి వెంకట విశ్వనాథ్ తమ వీనుల విందైన గాత్ర సంగీతముతో త్యాగరాజ, అన్నమాచార్య, రామదాసు కీర్తనలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.
శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ (విజయవాడ) వారి ఆధ్వర్యములో శ్రీ విజయకృష్ణా నాట్యమండలి మరియు శ్రీ సాయిబాబా నాట్యమండలుల ద్వారా ఉషాపరిణయము, కురుక్షేత్రము, కాశీ విఖ్యాతి గూర్చి రూపకము వీనుల విందుగా ప్రదర్శించినారు.
శ్రీ వి. వి. యల్. ఎన్. సుబ్రహ్మణ్య ప్రసాద్, ప్రిన్సిపాల్, వరంగల్ మూడు రోజుల కార్యక్రమాలనూ సమీక్షిస్తూ వందన సమర్పణ గావించారు. స్వర్ణోత్సవ వేడుకల ముగింపు సూచికగా ఆనందోత్సాహములతో బాణసంచా వెలుగులు విరజిమ్ముకున్నాయి. శ్రీ రామతారక ఆంధ్రాశ్రమము స్థాపననుండి, క్రమక్రమాభి వృద్ధితో ఇప్పటి పరకు వదాన్యులయిన దాతల విరాళములతో వర్ధిల్లుచున్నదను విషయము, అట్టి విరాళములకు ఇన్‌కంటాక్స్ వారి మినహాయింపు గలదను విషయము లోకవిదితమే. అట్లే ఇప్పటి స్వర్ణోత్సవ వేడుకలు జరుగునప్పుడు, సావనీరులో ప్రకటనల ద్వారాను అనేకమంది ఔత్సాహికులు తమ విరాళముల ద్వారా ప్రోత్సాహమిచ్చినారు. వారికి పాలక వర్గము కృతజ్ఞతలు తెలియజేయుచూ, కొంతమంది ప్రముఖుల ఆశీస్సులను ఉదాహరణ పూర్వకముగా తెలియజేయుచున్నాము –
శ్రీ మాగంటి సుబ్రహ్మణ్యం గారు, విజయవాడ అన్నదానమునకు, వేద పండితులకు వస్త్ర బహూకరణకు, స్వర్ణోత్సవ జ్ఞాపికలకు భూరి విరాళమిచ్చినారు.
శ్రీ ఎమ్. ఆర్. కె. రాజు, ట్రస్టీ గారు సభలు జరుగుచున్న సమయములో అప్పటికప్పుడు ఉత్సాహముతో అన్నదానమునకు రూ. 50,000/- కు చెక్కు ఇచ్చినారు. అట్లే స్వర్ణోత్సవములు జరుగుచున్న విషయము తెలుసుకున్న శ్రీ అత్తలూరి ప్రభాకర రావు, వారి తండ్రి గారి జ్ఞాపకార్ధము రూ. 50,000/- విరాళము ఇచ్చినారు. ఇంకనూ అనేక మంది గుప్త దానముల ద్వారా, తమ యథాశక్తి ప్రోత్సాహము అందజేసినారు.